Type to search

ఇక..ఎస్..తో.. పేటీఎం..?

News Top Stories

ఇక..ఎస్..తో.. పేటీఎం..?

raatnam, paytm, yes bank, paytm yes bank, paytm collaborates with yes bank, yes bank paytmబ్యాంకింగ్ రంగంలో సేవల్లో ముందు వరుసలో ఉన్న ఎస్ బ్యాంక్ లో కొంత మొత్తంలో వాటాను కొనుగోలు చేసే దిశగా డిజిటల్ చెల్లింపుల సంస్థ పే టీఎం ప్రయత్నాలు చేస్తోంది. యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్, ఆయనకు చెందిన సంస్థలకు యస్‌ బ్యాంక్‌లో 9.6 శాతం మేర వాటా ఉన్నది. ఈ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి పేటీఎమ్‌ యాజమాన్య సంస్థ, వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ చర్చలు జరుపుతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆర్‌బీఐ ఆమోదాన్ని బట్టి ఒప్పందం స్వరూపం ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేటీఎమ్‌ వ్యవస్థాపకులు విజయ్‌ శేఖర శర్మకు ఇప్పటికే పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో వాటా వున్నది. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, డీల్ ఈజీగా అవుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతానికైతే, సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక బ్యాంక్‌లో 5 శాతం మేర ఇన్వెస్ట్‌ చేయవచ్చు. యస్‌ బ్యాంక్‌ ఇటీవల క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా 1,930 కోట్ల నిధులు సమీకరించింది. మరిన్ని పెట్టుబడులు సమీకరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో యస్‌ బ్యాంక్‌కు 1,507 కోట్ల నికర నష్టాలు వాటిల్లాయి. బ్యాంక్‌ చరిత్రలో ఇవే అత్యధిక నష్టాలు గా నమోదయ్యాయి. మొండి బకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ స్థాయిలో నష్టాలు చవి చూశాయి. ఇదిలా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 114 కోట్ల మేర ఎస్ బ్యాంక్ నికర లాభాలను గడించింది. కాగా యస్‌ బ్యాంక్‌లో మైనారిటీ వాటా విక్రయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థకు విక్రయించే ఒప్పందం దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ డీల్‌లో భాగంగా 10 శాతం కంటే తక్కువ వాటాను ప్రపంచంలోనే టాప్‌ త్రీ టెక్నాలజీ కంపెనీల్లో ఒక దానికి విక్రయించనున్నామని యస్‌ బ్యాంక్‌ సీఈఓ, ఎమ్‌డీ రవ్‌నీత్‌ గిల్‌ వెల్లడించారు.

ఆ సంస్థ ఇంత వరకూ భారత్‌లోని ఏ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేయలేదని తెలిపారు. అయితే సంస్థ పేరును ఆయన వెల్లడించలేదు. ఈ టెక్నాలజీ సంస్థతో పాటు మరో రెండు మూడు సంస్థలు 20 కోట్ల డాలర్ల నుంచి 25 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో వైపు గత ఫైనాన్స్ ఇయర్ లో పేటీఎమ్‌ నష్టాలు భారీగా పెరిగాయి. 2019, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పేటీఎమ్‌ నష్టాలు 193 శాతం ఎగసి 4,217 కోట్లకు పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 1.604 కోట్లుగా ఉన్నాయి. ఇక ఆదాయం 3,052 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో 3,232 కోట్లకు పెరిగింది. వాటాదారులకు పంపిన వార్షిక నివేదికలో ఈ వివరాలను పేటీఎమ్‌ వెల్లడించింది. కాగా ఈ వివరాల కాపీని పేటీఎమ్‌ ఇంకా కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించలేదు. వ్యాపార విస్తరణ కోసం గత రెండేళ్లలో 14,000 కోట్లు పెట్టుబడి రూపంలో పెట్టామని, రానున్న రెండేళ్లలో మరో 21,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నామని ఇటీవలే పేటీఎమ్‌ వెల్లడించింది. మొత్తం మీద పే టీఎం ఎస్ బ్యాంక్ లో వాటా కొనుగోలు చేస్తే కొంత మేర షేర్ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *