Type to search

నిర్ణయం_మీదే

News Top Stories

నిర్ణయం_మీదే

apple, apple ceo, tim cook, apple ceo tim cook, azim premji, mukesh ambani, reliance, indra nooyi, wake up early, sleep timings, sleep, morning, early morningఈ ప్రపంచం లోని 75 శాతం మంది ధనవంతులు తెల్లవారుఝామున నిద్రలేస్తున్న వారే.

అంబానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, ఇంద్రా నూయీ… అందరూ అపర కుబేరులే. ఒక్కొక్కరి విజయానికి ఒక్కో కారణం. కానీ వీళ్లందరిలోనూ ఉండే ఓ లక్షణం ఏంటంటే… తెల్లవారుజామున కోడి కూయకముందే వీళ్ల దినచర్య మొదలైపోతుంది. వీళ్లే కాదు… ప్రపంచ ధనవంతుల్లో డెబ్భై ఐదు శాతానికి పైగా ఇదే అలవాటు.

సూర్యుడికి_పట్టుబడలేదు :-

‘గత యాభై ఏళ్లలో సూర్యుడెప్పుడూ నన్ను మంచమ్మీద చూడలేదు’… రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేష్‌ అంబానీ తన జీవనశైలి గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలివి. రాత్రి పడుకునేసరికి ఎంత ఆలస్యమైనా ఐదింటికల్లా ముఖేష్‌ దినచర్య మొదలవుతుంది. నిజానికి నాలుగున్నరకే మెలకువ వచ్చినా, నిద్ర మత్తు వదిలించుకునేసరికి ఐదవుతుందని చెబుతారాయన. ఐదున్నర నుంచి ఆరున్నర వరకూ జిమ్‌లో కసరత్తులు, తరవాత ఓ అరగంట ఈత అతడి వ్యాయామాల్లో భాగాలు. తరవాత వార్తాపత్రికలు చదివి, స్నానం, టిఫిన్‌ ముగించుకొని 8.30కల్లా ఆఫీసుకు బయల్దేరతారు. ‘చదువుకోకుండా పెట్రోలు బంకులో పనిచేసిన మా నాన్నే అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తే, విదేశాల్లో చదువుకున్న నేను ఇంకెంత పెద్ద వ్యాపారవేత్తను కావాలి? ముసుగుతన్ని పడుకుంటే అది సాధ్యం కాదుగా’ అంటారాయన.

పనితోనే_మొదలు :-

ప్రపంచాన్ని శాసిస్తోన్న నాలుగైదు కంపెనీల్లో ఆపిల్‌ ఒకటి. కోడి కూయకముందే నిద్రలేచే వ్యాపార దిగ్గజాల్లో ఆపిల్‌ సీయీవో టిమ్‌ కుక్‌ కూడా ఒకరు. ‘ఈ రోజు నలభై ఐదు నిమిషాలు ఎక్కువ విశ్రాంతి దొరికింది. 4.30కు నిద్రలేచా’… టిమ్‌ కుక్‌ ఇటీవల చేసిన ట్వీట్లలో ఒకటిది. నాలుగున్నరకల్లా టిమ్‌ నుంచి సంస్థలోని సీనియర్‌ ఉద్యోగులకు ఈమెయిళ్లు వెళ్లిపోతాయట. 3.30-4 మధ్య నిద్ర లేచే టిమ్‌ వెంటనే ఆ రోజు పని ప్రణాళికనూ, ముఖ్య విషయాలనూ ఉద్యోగులకు తెలియజేయడానికే ప్రాధాన్యమిస్తారు. తరవాత ఇతర దేశాల్లోని ఆపిల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఫోన్‌చేసి ముఖ్యవిషయాలేమైనా ఉంటే చర్చిస్తారు. ఐదింటికల్లా జిమ్‌లో వాలిపోతారు. ‘ఆఫీసులో బాయ్‌ కంటే ముందు నేనుండటమే నాకిష్టం. ఉద్యోగిగా చేరినప్పట్నుంచీ సీయీవో అయ్యాక కూడా ఆ అలవాటు వదల్లేదు’ అంటారు టిమ్‌.

అది_అదృష్టం :-

‘నిద్ర దేవుడు మనిషికిచ్చిన వరాల్లో ఒకటంటారు. నా విషయంలో మాత్రం అది మరచిపోయాడు’ అంటారు పెప్సికో అధినేత్రి ఇంద్రా నూయీ. వ్యాపారంలో ఎన్ని విజయాలు సాధించినా నిద్రపైన తాను సాధించిన విజయం మాత్రం అపూర్వం అంటారామె. ‘యేల్‌ యూనివర్సిటీలో చదువుకునేప్పుడు అర్ధరాత్రి నుంచి ఉదయం ఐదింటి దాకా రిసెప్షనిస్టుగా పనిచేసేదాన్ని. ఆ తరవాత వెళ్లి పడుకున్నా సరిగ్గా నిద్రపట్టేది కాదు. ముగ్గురు పిల్లలు పుట్టాక ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం ఉండేది కాదు. అలా క్రమంగా తక్కువ నిద్రకు అలవాటు పడిపోయా’ అని చెబుతారు. ఉదయం నాలుగింటికల్లా నిద్రలేచే నూయీ ఏడింటికల్లా ఆఫీసులో ఉంటారు. ‘ఎన్నో ఏళ్లుగా రోజూ నాలుగ్గంటలే నిద్రపోవడం అలవాటైంది. మొదట్లో నిద్రపట్టకపోవడం అనారోగ్యం అనుకున్నా. కానీ త్వరగా నిద్రలేవగలగడం అదృష్టం అని తరవాత అర్థమైంది’ అంటారు నూయీ.

సిబ్బందికంటేముందే :-

‘సిస్కో, మోటరోలా లాంటి సంస్థలకు సీటీవోగా పనిచేసిన వ్యాపార దిగ్గజం పద్మశ్రీ వారియర్‌ కూడా వేకువ పక్షే. ఠంచనుగా నాలుగున్నరకల్లా నిద్రలేవడం ఆవిడకు అలవాటు. లేవగానే వ్యాయామం కంటే వ్యాపారానికే ప్రాధాన్యమిస్తారు. గంటసేపు మెయిళ్లు చూసుకొని జవాబివ్వాల్సిన వాటికి ఇచ్చేస్తారు. కాసేపు పత్రికలు చదివాక వ్యాయామానికి అరగంట సమయం కేటాయిస్తారు. తరవాత కొడుకు కర్ణను స్కూల్‌కు తయారు చేసి తానూ ఆఫీసుకు బయల్దేరతారు. సిబ్బంది కంటే ముందుగా ఎన్నో ఏళ్లుగా 8.30కల్లా ఆఫీసులో ఉండటం తన విజయం రహస్యాల్లో ఒకటంటారు వారియర్‌.

విజయ_రహస్యం :-

‘అందరికంటే రెండు గంటలు ముందు నిద్రలేచే అలవాటుంటే, ఏడాదిలో అందరికంటే ఓ నెల ఎక్కువ బతికినట్టే’… విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ నమ్మి ఆచరించే సిద్ధాంతం ఇది. తెల్లవారుజాము 4.30కల్లా బెంగళూరులోని ప్రేమ్‌జీ బంగళాలో దీపాలు వెలుగుతాయి. వేడివేడి కాఫీతో ప్రేమ్‌జీ దినచర్య మొదలవుతుంది. నాలుగు ఖండాల్లోని విప్రో మేనేజర్లతో ఈమెయిళ్ల సంప్రదింపులు, కాల్స్‌తో ఐదింటికల్లా ఆఫీసుపని మొదలవుతుంది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేప్పటికే ప్రేమ్‌జీ ఏడుగంటలు పనిచేసి ఉంటారు. అంత సామ్రాజ్యం సృష్టించాలంటే ఆ మాత్రం శ్రమ ఉండాల్సిందే కదా.

( ఇక నిర్ణయం మీదే, నిద్ర ఎప్పుడు లేవాలో)

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *