Type to search

రవివర్మ పెయింటింగ్స్‌కు ధీటుగా మన హీరోయిన్ల ఫోటోలు

Box Office Latest News Trenging News

రవివర్మ పెయింటింగ్స్‌కు ధీటుగా మన హీరోయిన్ల ఫోటోలు

ఆనాటి చిత్రకారుడు రాజా రవివర్మ కుంచె నుండి జాలువారిన చిత్రాలు చూసినకొద్ది రెప్పవేయకుండా చూడాలనిపించేలా ఉంటాయి.ఇప్పుడు రవివర్మ గీసిన చిత్రాల్లా మారిపోయారు నేటితరం తారలు. రవివర్మ బొమ్మల పక్కన ముద్దుగుమ్మలు బుట్టబొమ్మల్లా తయారై పెయింటింగ్‌ను మరిపించేలా ఫొటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడ్తున్నాయి.

అలనాటి హీరోయిన్‌ సుహాసిని మహిళా సాధికారతే లక్ష్యంగా నామ్‌ అనే చారిటబుల్‌ ట్రస్ట్‌ను పదేళ్లుగా నడిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘నామ్‌’ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానించింది. సుహాసినికి 12 మంది హీరోయిన్లతో క్యాలెండర్‌ తయారు చేయాలని ఆలోచన తట్టింది. అయితే ఈ క్యాలెండర్‌లోని చిత్రాలు ఆషామాషీగా కాకుండా రవివర్మ పెయింటింగ్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలని భావించింది. రవివర్మ చిత్రాలను పునఃసృష్టించే సాహసం ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. చేయలేరు కూడా. కానీ ఆయన వేసిన పెయింటింగ్స్‌ను ఫొటోలుగా మలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు నటి సుహాసిని మణిరత్నం, ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ జి.వెంకట్‌రామ్‌.
అంతే.. సమంత, శృతిహాసన్‌ వంటి పలువురు హీరోయిన్లతో రవివర్మ గీసిన చిత్రాలను పున: సృష్టించారు. ఈ ఫొటో షూట్‌లో మంచు లక్ష్మి, ఖుష్బూ, ఐశ్వర్యారాజేశ్‌ కూడా పాల్గొన్నారు. వీరిని చూసిన అభిమానులు నటీమణుల అందాలకు అబ్బురపడిపోతున్నారు. రవివర్మ చేయి నుంచి జాలువారిన చిత్రాల్లా ఉన్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు. దర్పం ఉట్టిపడే దుస్తులు, ఆభరణాలు ధరించి… ఘనమైన బ్యాక్‌డ్రాప్‌లో పన్నెండు మంది భారతీయ మహిళలను చూపించాలనే ఈ క్యాలెండర్‌కు రూపకల్పన చేయడం జరిగింది’’ అని ఇటీవలే చెన్నైలో జరిగిన క్యాలెండర్‌ విడుదల కార్యక్రమంలో సుహాసిని అన్నారు.
ఇందులో రమ్యకృష్ణ, ఖుష్బూ, సమంత, శ్రుతీహాసన్‌, ఐశ్వర్యా రాజేశ్‌, నదియా, లిజీ, శోభన, కలర్స్‌ స్వాతి, మంచు లక్ష్మి, నిక్కీ గల్రానీలతో పాటు చాముండేశ్వరీలు రవివర్మ పెయింటింగ్స్‌ను సజీవంగా మన ముందుంచారు. ‘‘మాస్టర్‌ ఆర్టిస్ట్‌ రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో లైటింగ్‌ కోసం ఆయన వాడిన రంగులు నన్ను ఎప్పుడూ విస్మయానికి గురిచేస్తూ ఉండేవి. వాటిని రీ క్రియేట్‌ చేసే అవకాశం నాకు లభించిందనుకున్నా. ఆయన పెయింటింగ్స్‌కు నేను తీసిన ఫొటోలను మ్యాచ్‌ చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. స్టయిలింగ్‌, కాస్ట్యూమ్స్‌, నగలు, బ్యాక్‌డ్రాప్‌లోని ప్రాపర్టీ మొదలైనవి పెయింటింగ్స్‌లో ఉన్నవాటికి దగ్గరగా ఉండేలా చూశాం. సుహాసిని గారి ‘నామ్‌’ సంస్థ కోసం ఈ క్యాలెండర్‌ను తీసుకురావడం మర్చిపోలేని అనుభవం’’ అన్నారు ఫొటోగ్రాఫర్‌ వెంకట్‌రామ్‌. ఆయన అన్నట్టుగానే ‘తాము రవివర్మ చిత్రాలుగా మారడం గొప్ప అనుభూతికి లోనయ్యా’మని పలువురు తారలు ట్వీట్స్‌ చేస్తున్నారు.

అయితే అచ్చుగుద్దినట్లుగా రవివర్మ ఫొటోలు కావాలంటే అదేమంత సులువు కాదు. వారి వేషధారణలోనే కాదు, ముఖంలోనూ జీవం ఉట్టిపడాలి. ఏ మాత్రం తేడా వచ్చినా, విమర్శల పాలవడం తథ్యం. కానీ అలాంటి పెయింటింగ్‌కు పోటీగా తీసిన ఫొటోల్లో హీరోయిన్లతోపాటు ఫొటోగ్రాఫర్‌ సైతం బాగానే కష్టపడినట్లు సమాచారం. సమంత ఫొటో అభిమానులను చూపు తిప్పుకోనివ్వకుండా ఉంది.

మొత్తానికి ఈ క్యాలెండర్‌లోని ప్రతీ పేజీ భారతీయ మహిళాశక్తిని, అందాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ క్యాలెండర్‌తో పాటు ఫొటోలతో కూడిన బుక్‌లెట్‌లను కూడా ‘నామ్‌’ విక్రయిస్తోంది. వీటి అమ్మకాల ద్వారా సమకూరిన మొత్తాన్ని పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. క్యాలెండర్స్‌ కోసం 9176307415, 9841097885 నెంబర్లను సంప్రదించొచ్చు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *